Wednesday, September 20, 2006
ప్రత్యేక తెలంగాణా గురించి చర్చలు జరుగుతున్న రోజులివి.ముగిసిపోయిందనుకున్న ఒక వేర్పాటువాద అధ్యాయం మళ్ళీ 30 ఏళ్ళ తరువాత తెరుచుకోవడం పట్ల చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాని ప్రస్తుతం ప్రచారమౌతున్న తెలంగాణావాదం 1969-71ప్రాంతాలతో పోలిస్తే మరీ అంత చెడ్డది కాదని అందరూ ఒప్పుకోవాలి.పాపం !ప్రస్తుత తెలంగాణావాదులు అహింసామార్గంలోనే ప్రజాస్వామికంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని కృషిచేస్తున్నారు.
దానికీ జ్యోతిశ్శాస్త్రానికీ సంబంధమేంటి ?అని మీరు అడుగుతారు. అదే చెప్పాలనుకుంటున్నాను. కేసీయార్‌గారు అన్న ఒక మాట మాత్రం నిజం."ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించకుండా తెలంగాణావారిని ఎవరూ ఆపలేరు.కేసీయార్ కాకపోతే మరో పీసీయార్ వచ్చి ఉండేవాడు."గ్రహస్థితి నిజంగా అలాగే ఉంది.అయితే గ్రహస్థితులన్నీ తాత్కాలికమేనని మర్చిపోకూడదు.
ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతకం పరిశీలిద్దాం.
ఆంధ్రప్రదేశ్ జన్మలగ్నం మీనం. లగ్నాధిపతి అయిన గురుడు లగ్నం నుంచి ఏడో ఇల్లయిన కన్యలో నీచపడ్డ శుక్రుడి (తృతీయాధిపతి అన్నదమ్ములకి కారకుడు)తో కలిసి తృతీయ స్థానమైన వృషభాన్ని చూస్తున్నాడు.ఇది అన్నదమ్ముల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలకి దారి తీసే గ్రహస్థితి.అందుచేత ప్రతి పది ఇరవై ఏళ్ళకి ఒకసారి తెలుగువారు ఇలా దెబ్బలాడుతూనే ఉంటారు."రాష్ట్రం ముక్కలవుతుందేమో ! " అని ఎప్పటికప్పుడు అనిపిస్తుంది. కాని ఎప్పటికీ ముక్కలు కాదు.ఎందుకంటే లగ్నాధిపతి అయిన గురుడు మూడో దృష్టితో తన స్వంతరాశి(మీనం) అయిన లగ్నాన్ని కూడా చూస్తున్నాడు.ఎవరి లగ్నం మీదైనా గురుదృష్టి పడిందంటే వారు విపరీతంగా లావెక్కుతారు.అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇలా ఎప్పటికీ లావుగానే (పెద్ద రాష్ట్రంగానే) ఉంటుంది కాని చిన్న రాష్ట్రాలుగా ముక్కలవ్వడం మాత్రం జరగదు.ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఇచ్చినా కూడా అది అలా ఎక్కువ కాలం కొనసాగదు.మళ్ళీ తొందరగానే ఆంధ్రప్రదేశ్‌లో విలీనమౌతుంది.
జాతకచక్రం కాకుండా కాలచక్రాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కాలచక్రంలో ప్రస్తుతం మీనరాశి దశ నడుస్తోంది.ఇది 1981 లో మొదలై 2016 దాకా నడుస్తుంది. మీనరాశికి అధిపతి అయిన గురుడే ఆంధ్రప్రదేశ్‌కి లగ్నాధిపతి.ఈ గురుగ్రహం (Jupiter)సాక్షాత్తు భగవంతుడితో సమానంగా పరిగణించబడుతోంది.గురుడు బ్రాహ్మణ గ్రహం. విద్యలకి అధిపతి దొంగతనాలకి ప్రేరకుడు. శాంత స్వభావుడు. నెమ్మది గలవాడు. కాని వాగ్వాదాలంటే చెవి కోసుకుంటాడు. భోజనప్రియుడు. స్థూలకాయుడు. బంగారు మేనిచాయ గలవాడు. అందుచేత ఆయనకి పసుప్పచ్చ అత్యంత ప్రీతిపాత్రం.
1981నుంచి రాష్ట్రంలో జరుగుతూ వచ్చిన పరిణామాలన్నీ గురు గ్రహ ప్రభావం చేతనే.ఎందుకంటే తన లగ్నంలో జన్మించిన వారికి ఏ గ్రహమైనా తన దశలో భారీ లాభాలు చేకూరుస్తుంది.అందువల్ల 1983లో తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో ఒక పసుప్పచ్చ పార్టీ అధికారంలోకి వచ్చింది.దానితో తెలుగువారికిష్టం లేని "మద్రాసీ" అనే బిరుదు కాలగర్భంలో కలిసింది.ఈ మీనరాశి దశలో ఆంధ్ర ప్రభుత్వానికి అంతకుముందు సంప్రదాయంలా మారిపోయిన రాజకీయ అస్థిరత్వానికి తెరపడింది.తరువాత అరుదైన గ్యాస్ పెట్రోలియం యురేనియం నిక్షేపాలు ఆంధ్రాలో బయట పడ్డాయి. విద్యలకి ఆంధ్రా ప్రధాన కేంద్రమైంది.విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇది ఎంత స్థాయిలో జరిగిందంటే BITS, Pilani లో 80 శాతం మంది విద్యార్థులు తెలుగువారే అయ్యేంతగా. 4,600 IIT సీట్లలో 800 పైగా ఆంధ్రా విద్యార్థులే సాధించుకునేంతగా.విమానాశ్రయాలు కూడా పెరిగాయి.అలానే తెలుగు క్రీడాకారులకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం ప్రారంభమైంది.తెలుగు సినిమాలు ఆంధ్రా దాటి ఖండాంతరాల్లో వందలాది థియేటర్లలో విడుదలవ్వడం మామూలైంది.అంతకంటే ముఖ్యమైన విషయం-గురుగ్రహ ప్రభావం చేత 1981నుంచి ఆంధ్రులంతా గురు (షిరిడీ సాయిబాబా)భక్తులుగా మారిపోయారు.
శనిలాగా గురుడు కూడా తన దశ యొక్క ఆఖరి సంవత్సరాల్లో ఎక్కువ ఫలితాలిస్తాడు.కనుక ఈ పురోగమనం 2010 నుంచి ఇంకా ఇంకా విజృంభిస్తుంది.
ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పడం కుదరదు.
Friday, September 08, 2006
ఏలినాటి శని అంటే ఏమిటి ? అది ప్రతి మనిషికీ ఎందుకు అనుభవంలోకొస్తుంది ? అనేది అర్థంకావాలంటే ముందు జ్యోతిశ్శాస్త్రంలో కొన్ని ప్రాథమిక విషయాలు తెలియాలి. అవి వివరించడం కోసమే ఈ పోస్టు కేటాయిస్తున్నాను. కాని ఇక్కడ లోతైన సాంకేతిక వివరాల (deep technical details) జోలికి వెళ్ళడం లేదు.అవి తెలుసుకోవాలంటే జ్యోతిశ్శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక రచనల (standard works)ని సంప్రదించాల్సి ఉంటుంది.
'జాతకం ఉండగా మళ్ళీ ఈ గోచారం ఏంటి ?' అని సందేహం కలుగుతుంది సామాన్యులకి. గోచారమన్నా, గ్రహచారమన్నా ఒకటే. 'చారం' అంటే సంచరించడం. గ్రహాలు ప్రస్తుతం ఏఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలిపేది గ్రహచారం. ఏలినాటి శని అనేది గ్రహచారానికి సంబంధించిన దృగ్విషయం (phenomenon). జాతకం ఎప్పుడో తీసిన ఫోటో లాంటిది కాగా, గోచారం live video లాంటిది. అందుకే జాతకంలో గ్రహాలు కదలవు. జాతకుడు పుట్టేనాటికి అవి ఏఏ రాశుల్లో ఉన్నట్లు జాతక చక్రంలో నమోదు చెయ్యబడ్డాయో అవే రాశుల్లో ఉండి జీవితాంతమూ మన మీద ప్రభావం చూపుతాయి. అంటే జాతకంలో మారేదేమీ ఉండదు. ఆ చక్రం మనకి దేవుడు స్వహస్తంతో రాసిన తలరాత అన్నమాట. అది ఒక మనిషి యొక్క యావజ్జీవితానికీ వెయ్యబడ్డ program
ఏలినాటి శనిదశ గోచార వశాన ప్రస్తుతం శని మన జాతకంలో ఏఏ రాశుల్లో సంచరిస్తున్నాడనే దాన్ని బట్టిఏర్పడుతుంది.శనిగ్రహం చంద్రలగ్నం నుంచి 12వ, 1వ, 2వ స్థానాల్లో వరసగా సంచరించే కాలాన్ని ఏలినాటి శనిదశ అంటారు. ఇది ఏడున్నర సంవత్సరాల పాటు జరుగుతుంది. ఎందుకంటే, శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలుంటాడు. చంద్రుడున్న స్థానాన్ని కూడా కలుపుకుని ఈ స్థానాల్ని లెక్కిస్తారు.(Both ends inclusive).
చంద్రలగ్నం అంటే ఏంటి ? (పైన ఇచ్చిన చక్రాల్ని పరిశీలించండి) జాతకుడు పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో/రాశిలో ఉంటాడో అదే చంద్రలగ్నం. పైన ఇచ్చిన చక్రాల్లో చంద్రుడు మొదటి స్థానంలో మేషరాశిలో ఉన్నాడు. (మన ప్రస్తావనకి అవసరం లేదు గనుక మిగతా గ్రహాల స్థితి సూచించబడలేదు)ఆ వ్యక్తి జాతకానికి అదే చంద్రలగ్నం. అప్పుడు 12వ స్థానమైన మీనరాశిలోను, 1వ స్థానమైన మేషరాశిలోను, 2వ స్థానమైన వృషభ రాశిలోను శని సంచరిస్తే అప్పుడు సదరు వ్యక్తికి ఏలినాటి శని జరుగుతుంది. మనిషికో చంద్రలగ్నం ఉంటుంది గనుక అందరికీ ఒకేసారి ఏలినాటి శని రాదు.
పైన రెండు రకాల చక్రాలిచ్చాను. మొదటిది సవ్య చక్రం. దీంట్లోని రాశుల్నీ, స్థానాల్నీ ప్రదక్షిణ క్రమం (clock-wise)లో లెక్కించాలి. ఇది ఆంధ్రదేశమంతటా వాడుకలో ఉంది. రెండోది అపసవ్య చక్రం. దీంట్లోని రాశుల్నీ, స్థానాల్నీ అప్రదక్షిణ క్రమం (anti-clock-wise)లో లెక్కించాలి. ఇది కళింగాంధ్రా (అంటే తూర్పు గోదావరి, విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం, గంజాం, బరంపురం జిల్లాల)లో వాడుకలో ఉంది. ఉపయోగపడే విషయంలో మాత్రం రెండూ సమానమే. ఎవరి అలవాటుని బట్టి వారు పై విధంగా జాతకాలు రాస్తూంటారు.
శని కొన్ని జాతకాలకి చాలా మేలు చేస్తాడు. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం తీసుకుంటే అందులో శని తులారాశిలో మహోచ్ఛంలో ఉన్నాడు. అందువల్ల ఆయనకి తిరుగులేని ప్రజాదరణ, దిగంత విశ్రాంత కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. శని ఆ స్థితిలో ఎవరి జాతకంలో ఉన్నప్పటికీ వారి చుట్టూ అలా ఒక సమ్మోహన వలయం ఏర్పడుతుంది.అయితే వారు ఏ రంగంలో తమ ప్రాభవం (domination) వెలిగిస్తారనేది మిగతా గ్రహాల్ని బట్టి చెప్పాలి. విదేశయానంలో శని పాత్ర కాదనలేనిది. అలాగే ఆయుర్దాయానికి సైతం శనిస్థితి చాలా ముఖ్యం. వివాహం కూడా సాధారణంగా శనిగోచారంలోనో, శని యొక్క దశా-అంతర్దశల్లోనో సంభవించడం మనం గమనిస్తాం. శని అనుగ్రహం పొందినవారికి ఆయన వందలాది, వేలాదిమంది సేవకుల్ని, ఉద్యోగుల్ని సమకూర్చి పెడతాడు.మనం చూసే మెగా కార్పొరేషన్‌లని స్థాపించిన పారిశ్రామికవేత్తల జాతకాల్లో శని అత్యుత్తమస్థితిలో ఉండడం కనిపిస్తుంది.

శని ఆధిపత్యం వహించే విషయాలు : శనికి సంబంధించిన సంఖ్య 8 (ఎనిమిది). శని లక్షణాలే గల రాహువు యొక్క సంఖ్య (4-నాలుగు)కి ఇది రెట్టింపు. అందుచేత ఈ రెండు పాపగ్రహాల సంఖ్యలూ దొంగలకి అత్యంత అనుకూలమైనటువంటివి. ఈ సంఖ్యలు వచ్చే రోజుల్లో దొంగతనాలు విజయవంతంగా జరగడం మనం గమనిస్తాం. అంటే ఏ నెలలో అయినా 4, 8, 13, 17, 22, 26, 31 తేదీలన్నమాట. అందులోను ఆ దొంగల అదృష్టసంఖ్యలు కూడా 4 లేక 8 అయితే ఇంక పట్టశక్యం కాదు.
శని మానవజీవితంలో చాలా విషయాల్ని అదుపుచేస్తూంటాడు.
శని కారకుడైన శరీర స్థితులు : రోగిష్టితనం, కష్టాలు, డిప్రెషన్, వికార రూపం, నపుంసకులు, వికారమైన దుస్తులు, వికారమైన వేషం, కుంటితనం, అవిటితనం, వాతరోగాలు, పక్షవాతం, కేన్సరు, బోదకాలు, కురుపులు, మూర్ఛ.

