Friday, September 08, 2006

 
శని శుభాశుభాలు - 2



Posted by Picasa

శని స్వరూపం : శనిని మన పూర్వగ్రంథాల్లో 90 ఏళ్ళ వృద్ధుడుగా వర్ణించారు.అంటే ఆయన ఎల్లప్పుడూ అదే వయసులో కనపడతాడట. ఆయన నపుంసకుడు. అంటే స్త్రీ కాదు. పురుషుడూ కాదు. ఆయన నల్లగా సన్నగా పొడవుగా ఎముకలపోగులా, నరాల కట్టలా ఉంటాడట. ఒంటినిండా నూనె పూసుకుని, నల్లని బట్టలు, ఇనప కిరీటం, అలాగే ఇనప ఆభరణాలు ధరించి, చేత్తో చీపురుకట్ట పట్టుకుని తన ప్రియమైన కాకి వాహనం ఎక్కి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాడట. చెట్లని ఎండించి మోడుబార్చే ఆకురాలు కాలం (శిశిరఋతువు) ఆయనకి చాలా ప్రియమైనది. ఆయనకి అత్యంత ఇష్టమైన రుచి వగరు. మరుగుదొడ్లు, మురికి గుంటలు, కనీస వసతులు లేని గ్రామాలు శ్మశానాలు, పెంటకుప్పలు, పాడుపడ్డ భవనాలు, పనికిరాని వస్తువులు దాచుకునే చోట్లు శనికి ప్రీతిపాత్రమైన నివాసస్థానాలు. ఆయన సంపూర్ణ పాపగ్రహం, సంపూర్ణ క్రూరగ్రహం కూడా !అయితే ఇందాకనే చెప్పుకున్నట్లు ఈ పాపత్వానికి, క్రూరత్వానికీ చాలా పరిమితులున్నాయి.

శని ఆధిపత్యం వహించే విషయాలు : శనికి సంబంధించిన సంఖ్య 8 (ఎనిమిది). శని లక్షణాలే గల రాహువు యొక్క సంఖ్య (4-నాలుగు)కి ఇది రెట్టింపు. అందుచేత ఈ రెండు పాపగ్రహాల సంఖ్యలూ దొంగలకి అత్యంత అనుకూలమైనటువంటివి. ఈ సంఖ్యలు వచ్చే రోజుల్లో దొంగతనాలు విజయవంతంగా జరగడం మనం గమనిస్తాం. అంటే ఏ నెలలో అయినా 4, 8, 13, 17, 22, 26, 31 తేదీలన్నమాట. అందులోను ఆ దొంగల అదృష్టసంఖ్యలు కూడా 4 లేక 8 అయితే ఇంక పట్టశక్యం కాదు.

శని మానవజీవితంలో చాలా విషయాల్ని అదుపుచేస్తూంటాడు.

శని కారకుడైన శరీర స్థితులు : రోగిష్టితనం, కష్టాలు, డిప్రెషన్, వికార రూపం, నపుంసకులు, వికారమైన దుస్తులు, వికారమైన వేషం, కుంటితనం, అవిటితనం, వాతరోగాలు, పక్షవాతం, కేన్సరు, బోదకాలు, కురుపులు, మూర్ఛ.
శని కారకుడైన శరీర భాగాలు : ఎముకలు, పళ్ళు, గోళ్ళు, వెంట్రుకలు, ప్రేగులు.
శని కారకుడైన స్వభావాలు, అలవాట్లు : ఆచారహీనత్వం, అబద్ధాలు, పౌరుషం లేకపోవడం, మూర్ఖత్వం, చెడు స్నేహాలు, నలుపు, పాపాలు, క్రూరత్వం, జూదం, మద్యపానం, పిచ్చి, ఆలస్యం, అశుచిగా మురిగ్గా బ్రతకడం, క్షుద్ర దేవతోపాసన, వెంకటేశ్వర భక్తి, హనుమద్భక్తి, తమోగుణం.

శని కారకుడైన జాతులు : అడవిమనుషులు, శూద్రకులాలు, సేవకులు, నీచులు.

శని కారకుడైన జంతువులు, పక్షులు : గాడిదలు, దున్నపోతులు, కాకులు
శని కారకుడైన పదార్థాలు : బూడిద, ఇనుము, నువ్వులు, నూనెలు, ఉప్పు , ఉల్లి, వేరుసెనగ, దుంపల జాతులు, పెట్రోలు, కిరోసిన్, బొగ్గు, తారు, గనులు త్రవ్వే సాధనాలు,
శని కారకుడైన వృత్తులు : శ్రమ, బానిసత్వం, ముళ్ళురాళ్ళు గల ప్రదేశాల్లో సంచారం, రికామీ జీవితం (jobless life), ఇనుము, సీసము, పక్షులు, పశువులు, రాగులు, జొన్నలు, మినుములు, మత్తుపదార్థములు మొ.అమ్మిజీవించడం, నల్లబజారులో వస్తువులమ్మి జీవించడం, కూలీల్ని మోసం చేసి జీవించడం, , తోళ్ళ పరిశ్రమలు, రహస్యాలు, కుట్రలు, విషప్రయోగాలు, సేవకవృత్తి (ఒకరి కింద జీతం తీసుకుని పనిచెయ్యడం), పురాతన వస్తువులు త్రవ్వి తీయడం (ఆర్కియాలజి).
శని కారకుడైన సంఘటనలు : బీభత్సాలు, అయోగ్యురాలి కడుపున పుట్టడం, విఘ్నాలు, దరిద్రం, రాళ్ళదెబ్బలు, భార్యాబిడ్డలచేత తిరస్కరించబడడం, పిశాచబాధ.
శని దిక్కు : పడమటి దిక్కు
శని కారకుడైన ప్రదేశాలు : నూనెమిల్లులు, ఐస్‌ఫ్యాక్టరీలు , సొరంగాలు, గుహలు.
శని సాధారణంగా పై విషయాలకి కారకుడైనప్పటికీ, జాతకంలో లగ్నం నుంచి 1,4,7,10 స్థానాలకి ఆధిపత్యం వహిస్తూ, అదే సమయంలో మంచి రాశుల్లో ఉన్నట్లయితే, పై వాటికి పూర్తిగా విరుద్ధమైన శుభఫలితాలిస్తాడని గుర్తుంచుకోవాలి.

Comments:
about my futuer
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?